నీటి పారుదల రంగంపై ప్రజంటేషన్.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
గత ప్రభుత్వం అవినీతి వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అక్టోబర్‌లో సమస్య మొదలైతే కేసీఆర్ ఇంత వరకూ స్పందించలేదన్నారు.
By అంజి Published on 17 Feb 2024 11:28 AM ISTనీటి పారుదల రంగంపై ప్రజంటేషన్.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
గత ప్రభుత్వం అవినీతి వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అక్టోబర్‌లో సమస్య మొదలైతే కేసీఆర్ ఇంత వరకూ స్పందించలేదన్నారు. బ్యారేజీ ప్రారంభించినప్పటి నుంచి పర్యవేక్షణ, నిర్వహణ లేదన్నారు. ఇరిగేషన్ శాఖలో జరిగినంత అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు.. మూడేళ్లలోనే కుంగిందన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పు చేసి తమను విమర్శిస్తోందని మండిపడ్డారు.
కాళేశ్వరం అవినీతి బయటపెట్టాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ప్రజలకు తెలియాలని వ్యాఖ్యానించారు. మూడేళ్లుగా కనీసం మెయింటనెన్స్ చేయలేదని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందని తెలిపారు. నాసిరకం నిర్మాణం, డిజైన్ లోపాలను ఎత్తి చూపిందని అన్నారు. మేడిగడ్డ నిర్మాణానికి రూ.1800 కోట్లకు టెండర్లు పిలిచి రూ.4500 కోట్లకు పెంచారని చెప్పారు.
బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తప్పుకుంటే మేడిగడ్డను రిపేర్ చేసి వ్యవసాయానికి నీరు ఇస్తామని అంటున్నారని, నాణ్యతా లోపంతో ప్రాజెక్టు కట్టిందే మీరు (బీఆర్‌ఎస్) అని, ఇప్పుడు మళ్లీ ఏం చేస్తారని ప్రశ్నించారు. రిపేర్ చేస్తామని అడిగే అర్హతే బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేసిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా నిరుపయోగమని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు నడిపి రోజు 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని చెప్పారు. రాష్ట్రంలో అన్ని రకాల అవసరాలకు 160 మిలియన్ల విద్యుత్ అవసరం అయితే.. తెలంగాణ మొత్తానికి కావాల్సిన కరెంట్ కంటే కాళేశ్వరానికి ఎక్కువ విద్యుత్ అవసరమని తెలిపారు. దీని కారణంగా ఏడాదికి రూ.1037 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచి లీకులు మొదలయ్యాయని, అందులోని నీటిని తొలగించాలని ఎన్‌డీఎస్‌ఏ పేర్కొందన్నారు. ఈ బ్యాఏజీ కూడా ప్రమాదంలో ఉందని, కుంగేలా కనిపిస్తోందన్నారు. రిజర్వాయర్‌లో నీరు నింపొద్దని ఎన్‌డీఎస్‌ఏ సూచించిందన్నారు. కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.