హైదరాబాద్: చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వడానికి నేతన్న భరోసా పథకం కింద ఈ ఏడాది రూ.48.80 కోట్లు కేటాయించినట్టు వ్యవసాయ, చేనేత, జౌళీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ స్కీమ్‌తో 6,780 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకంలో భాగంగా నేతన్నలకు రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు విడతల్లో అందజేస్తామన్నారు. చేనేత కార్మికుల రుణప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. 6,780 మందికి రూ.లక్ష వరకు రుణ మాఫీ కానున్నట్టు పేర్కొన్నారు.
65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు వచ్చే నెలలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఇందిరమ్మ చీరలను నవంబర్ 15 నాటికి సిద్ధం చేయాలని సూచించారు. నవంబరు 19 ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న సచివాలయంలో మంత్రి తుమ్మల, జౌళీ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను ఉత్పత్తి చేయించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఇందిరమ్మ చీరెల తయారీతో దాదాపు 6,500 నేత కార్మికులకు ఉపాధి లభించడంతో పాటు చేనేత రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు.