ఖమ్మం జిల్లా శివారులోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో గృహాలు కొల్పోయిన వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. ఇళ్లు కొల్పోయిన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. అక్కడ ఇళ్లు కోల్పోయిన వారిలో అసలైన నిరుపేదలను గుర్తించేందుకు సర్వేను వేగవంతం చేసినట్లు తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత అర్హులైన ఇళ్లు లేని పేదల కోసం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
పేదల సంఘం ముసుగులో కొందరు అమాయక ప్రజల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి, నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేశారని తుమ్మల మండిపడ్డారు. ఈ అక్రమాలపై విచారణ జరుగుతోందని, అందుకే చట్టపరంగా గుడిసెలను తొలగించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
పార్టీ కార్యకర్తలు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు రెచ్చగొట్టబడవద్దని, సంయమనం పాటించాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై అనవసరంగా పోలీసు కేసులు పెట్టవద్దని సూచించారు. ఆక్రమణదారుల వెనుక ఉన్న స్వార్థపరుల ఆటలు సాగనివ్వమని, ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు.