పొరపాటే.. క్షమాపణలు కోరిన మంత్రి తలసాని
స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 8:28 AM ISTపొరపాటే.. క్షమాపణలు కోరిన మంత్రి తలసాని
హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఇటీవల జరిగిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంత్రి తలసాని బైంసా ఏఎంసీ చైర్మన్ రాజేశ్‌కుమార్ బాబుని నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దాంతో.. మంత్రి తలసానిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. క్షమాపణలు కోరారు.
స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో జనాలు ఎక్కువగా ఉన్నారని.. రద్దీ కారణంగా ఒకరు తన కాలుని బూటుకాలుతో తొక్కారని మంత్రి తలసాని చెప్పారు. దాంతో.. కాలుకి గాయమై రక్తస్రావం అయ్యిందని తెలిపారు. నొప్పి బాధతోనే ముందు ఉన్నది ఎవరో గమనించకుండానే ఒక వ్యక్తిని వెనక్కి లాగానని తలసాని వివరణ ఇచ్చారు. అయితే.. అలా లాగిన వ్యక్తి గిరిజనుడు భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేశ్‌కుమార్ బాబు అని తర్వాత తెలిసిందని అన్నారు. వీడియో కూడా వైరల్ అవ్వడంతో.. వెంటనే ఆయనకు ఫోన్ చేశానని తెలిపారు. పొరపాటు జరిగిందని.. క్షమాపణ కోరానని తెలిపారు మంత్రి తలసాని.
రాజేశ్‌కుమార్ బాబుకే కాదు.. గిరిజన సమాజానికి క్షమాపణలు కోరుతున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో విషయాన్ని పెద్దది చేసి చూపుతూ.. దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, దళితులు, వెనుకబడ్డ వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉండే వ్యక్తినని చెప్పుకొచ్చారు. ఈ సంఘటనపై తనతో ఎమ్మెల్సీ దండె విఠల్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహా పలువురు మాట్లాడారని తెలిపారు. ఎలాంటి బేషజాలు లేకుండా క్షమాపణలు కోరుతున్నానని మంత్రి తలసాని వివరణ ఇచ్చారు.
కాగా.. రాజేశ్‌బాబుకి అవమానం జరిగిందంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను విమర్శిస్తూ గిరిజన, లంబాడా సంఘాల నేతలు నిర్మల్ జిల్లా భైంసాలో ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ర్యాలీ నిర్వహించి, తలసాని దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. దాంతో.. స్పందించిన మంత్రి తలసాని బహిరంగంగా క్షమాపణ కోరారు.