శాంతియుతమైన హైదరాబాద్‌ను నాశనం చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడులకు దిగడం దారుణమని అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగుతున్న టైంలో బీజేపీ నేతలు కవిత ఇంటిపై రావడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎవరి ఇంటి మీదికైనా వెళ్లి దౌర్జన్యం చేస్తూ ఉరుకుంటారా? అని ప్రశ్నించాఉ. బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రావడం సిగ్గుచేటన్నారు. క్రమశిక్షణా అంటే ఇదేనా అని బీజేపీ నేతలను దుయ్యబట్టారు.
''మీ ఇళ్ల మీదకు రావాలంటే పెద్ద విషయం కాదు. మా టీఆర్‌ఎస్ సైన్యం ఎంతో తెలుసా? మేం దాడులకు దిగితే బీజేపీ నేతలు మిగులుతారా?'' అంటూ మంత్రి తలసాని ధ్వజమెత్తారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేశారు. ''నిన్న ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి కారణం ఏంటి?. ఆ ఆంశంపై మీకు అవగాహన ఉందా?'' అని తలసాని ప్రశ్నించారు. ఒక ఎంపీ చేసిన తప్పుడు ఆరోపణలను పట్టుకొని బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సమంజసం కాదని అన్నారు.
నిరాధారమైన ఆరోపణలతో ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులకు దిగితే సహించేది లేదన్నారు. ఉన్నతమైన నాయకత్వంలో ఉండే బీజేపీ.. ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని మంత్రి తలసాని అన్నారు. వేలాది సైన్యం తమకూ ఉందని, మీ ఇండ్ల మీద దాడులు, పార్టీ ఆఫీస్‌ల మీదకు వస్తే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. సంఘీభావం చెప్పడానికి వచ్చిన తమ కార్యకర్తలు.. బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్తామని ఉంటున్నారని, తమకు సంస్కారం ఉందని.. తమ పార్టీ అధినేత అది తమకు నేర్పలేదన్నారు.