ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి కాల్పులు.. నెటిజ‌న్ల ఆగ్ర‌హం

Minister Srinivas Goud who was shot in the air by police gun during the freedom rally. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానం నుంచి ట్యాంక్ బండ్

By అంజి  Published on  13 Aug 2022 4:43 PM IST
ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి కాల్పులు.. నెటిజ‌న్ల ఆగ్ర‌హం

స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానం నుంచి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుక‌ల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్య‌వ‌హ‌రించిన‌ తీరు విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. పోలీసులకు చెందిన ఎస్‌ఎల్‌ఆర్‌ వెపన్‌తో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ జరిపిన కాల్పుల వీడియో ఒక‌టి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మంత్రి గాల్లోకి కాల్పులు జరపడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ మిస్‌ ఫైర్‌ అయి ప్రాణ నష్టం జరిగితే ఎవరిది భాద్యత అంటూ ఫైర్‌ అవుతున్నారు.

''జాతీయ జెండా ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కానిస్టేబుల్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్‌తో గాలిలోకి కాల్పులు జరిపారని, అతనిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేస్తారా?'' అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరపడం ఏ విధంగానూ దేశ భక్తిని ప్రోత్సహించదని.. మంత్రిని బర్తరఫ్‌ చేసి ఆయుధాల చట్టం కింద వెంటనే కేసు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తూ తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీకి ట్విటర్‌లో ట్యాగ్‌ చేస్తున్నారు.

నేను కాల్చింది రబ్బర్‌ బుల్లెట్టే: మంత్రి

తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటం, నెటిజన్ల నుంచి విమర్శలు వస్తుండటంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. తాను కాల్చింది రబ్బర్‌ బుల్లెట్‌ అని చెప్పారు. తాను ఆల్‌ ఇండియా రైఫిల్‌ అసోసియేషన్‌ మెంబర్‌ని అని, క్రీడామంత్రిగా తనకు ఆ అర్హత ఉంటుందన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జిల్లా ఎస్పీని కలిసి సరైన సమాచారం తెలుసుకోవాలన్నారు. ఎస్పీ ఇస్తేనే తాను తుపాకీ కాల్చానని మంత్రి చెప్పారు. ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్‌ కోసం రబ్బర్‌ బుల్లెట్‌ కాలుస్తారని, తాను నిజమైన బుల్లెట్‌ కాల్చినట్లు నిరూపిస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.


Next Story