తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శనివారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను మహబూబ్ నగర్ పట్టణంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరణించిన విషయం తెలిసిందే.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ. వారి ఆశీర్వాదాలు తీసుకున్న తరువాతనే ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు. ఇటీవల ప్లీనరీ సమావేశాలకు సైతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ ఆశీర్వాదాలు తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం.. ఆ వెంటనే బెంగళూరులో సమావేశానికి వెళ్లారు. శుక్రవారం వరకు మంత్రి అక్కడే ఉన్నారు. తల్లికి గుండె నొప్పి వచ్చిన విషయం తెలిసిన వెంటనే బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చారు.
శాంతమ్మ మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ తల్లి మృతి పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.