ప్రతిపక్షాలపై తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో ఫ్రీడమ్ ర్యాలీలో తుపాకి పేల్చినట్లు వచ్చిన ఆరోపణలపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్.. రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లను తోసిపుచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక సౌజన్యంతో సర్దార్ సర్వాయి పాపన్న 372వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
సాధారణ ఒక ఘటన జరిగితే విచారణ ఉంటుందన్న మంత్రి.. తాను నిన్న పేల్చింది రబ్బర్ బుల్లెట్ అని మరోసారి స్పష్టం చేశారు. విపక్షాలు అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సర్ధార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, కుమురం భీం, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మహనీయుల జయంతి వేడుకలను అన్ని వర్గాలు వారు చేసుకోని సమైఖ్య స్ఫూర్తిని చాటాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా 52 శాతంపైగా బీసీ జనాభా ఉన్నారని.. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు.