బీసీల వెనుకబాటుకు కారణమే BRS..అసెంబ్లీ వాకౌట్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
తెలంగాణలో బీసీల వెనుకబాటుకు, వారికి జరిగిన అన్యాయానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రధాన కారణమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు.
By - Knakam Karthik |
బీసీల వెనుకబాటుకు కారణమే BRS..అసెంబ్లీ వాకౌట్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
తెలంగాణలో బీసీల వెనుకబాటుకు, వారికి జరిగిన అన్యాయానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రధాన కారణమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో బీసీల సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్ నాయకులకు, ఇప్పుడు ఆ వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. సభలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు చిత్తశుద్ధి లేకుండా వాకౌట్లు చేయడం వారి రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షం అసూయతో విమర్శలు చేస్తోందని, ప్రజలు వీరి ప్రవర్తనను నిశితంగా గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. రాహుల్ గాంధీ దార్శనికతతో బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే, అడ్డుతగలడం మానుకుని బాధ్యతాయుతమైన సూచనలు చేయాలని హితవు పలికారు.
పోలీసు సంక్షేమం, రవాణా శాఖా సంస్కరణల పైనా మంత్రి ఘాటుగా స్పందించారు. కేవలం భత్యాలు ఇస్తేనే సంక్షేమం జరిగినట్లు కాదని, తమ ప్రభుత్వం పోలీసుల అభ్యున్నతికి సమగ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ నాయకులు, నేడు అదే సంస్థపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు కనీసం చర్చలకు కూడా రాని వారు, ఇప్పుడు ఏ విశ్వసనీయతతో విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తాము లాభాల బాట పట్టించామని గర్వంగా చెప్పారు. తమ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉందని, ఆ తర్వాత కూడా తిరిగి అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ నాయకత్వంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అవసరమైతే రాజ్యాంగ సవరణలు కూడా చేపడతామని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా ప్రకటించారు.