హైదరాబాద్: ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి కొత్త పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే మహిళా సంఘాలకు చెందిన 50 బస్సులను ప్రారంభిస్తారని, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి.. మహిళా శక్తి పాలసీని విడుదల చేస్తారని చెప్పారు.
నారాయణ పేట జిల్లా మాదిరిగా.. మిగతా జిల్లాల్లో కూడా మహిళలే పెట్రోల్ బంకులు నిర్వహించేలా ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే నిన్న మహిళా దినోత్సవం నిర్వహణపై మంత్రి సీతక్క సమీక్ష చేశారు. వడ్డీ లేని రుణాల చెక్కులను సీఎం పంపిణీ చేస్తారని, అలాగే మహిళా సంఘాల కోసం 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను సీఎం వర్చువల్‌గా ప్రారంభిస్తారని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాల బలోపేతానికి సంబంధించి సీఎం రేవంత్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు.