తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నికపైనే ఉంది. ప్రధాన పార్టీలు అయిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కాంగ్రెస్ సహా పార్టీలన్ని ఇప్పుడు మునుగోడులో పాగా వేసి ప్రచారం చేస్తున్నాయి. విజయమే లక్ష్యంగా శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా బరిలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. శనివారం మంత్రి సత్యవతి రాథోడ్ యాద్రాద్రి భువనగిరి జిల్లా రాధానగర్ తండాలో కాళ్లకు చెప్పులు ధరించకుండానే ప్రచారం చేయడం కనిపించింది. చెప్పులు ఎందుకు ధరించలేదన్న ప్రశ్నపై మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి సీఎం అయ్యే వరకు పాదరక్షలు(చెప్పులు) ధరించబోనని అన్నారు
సెప్టెంబర్ 17 నుంచే దీక్ష చేపట్టినట్లు తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఆరు శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు. గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్టు తెలిపారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారన్న సత్యవతి రాథోడ్.. కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పాదరక్షలు ధరించబోననన్నారు.