సనత్‌నగర్ టిమ్స్ పనులపై అధికారులకు మంత్రి రాజనర్సింహ డెడ్‌లైన్

సనత్‌నగర్ టిమ్స్‌ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్‌‌అండ్‌బీ అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

By -  Knakam Karthik
Published on : 19 Sept 2025 5:30 PM IST

Hyderabad News, Sanathnagar TIMS Hospital, Minister Rajanarsimha, CM Revanth

హైదరాబాద్: సనత్‌నగర్ టిమ్స్‌ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్‌‌అండ్‌బీ అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుండే ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా అవసరమైన ఎక్విప్‌మెంట్, ఫర్నీచర్ అన్నీ ముందే సమకూర్చుకోవాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తుకు మంత్రి సూచించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించుకోవాలని డీఎంఈ నరేంద్ర కుమార్‌‌ను ఆదేశించారు. సనత్‌నగర్, ఎల్బీనగర్, కొత్తపేట్ టిమ్స్ హాస్పిటళ్లు, నిమ్స్ హాస్పిటల్‌ విస్తరణ ప్రాజెక్ట్‌, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌‌లో ఆర్‌‌ అండ్‌ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

సనత్‌నగర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, అల్వాల్‌, ఎల్బీనగర్ టిమ్స్‌ల పనులు మరో 6 నెలల్లో పూర్తి అవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. సనత్‌నగర్ టిమ్స్‌ను ఈ ఏడాది చివరిలో ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి గుర్తు చేశారు. అక్టోబర్‌‌ చివరి నాటికల్లా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌‌అండ్‌బీ, ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావొద్దన్నారు. ఎక్విప్‌మెంట్‌, ఫర్నీచర్ కొనుగోలు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్స్ అన్నీ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో కూడినవే కొనుగోలు చేయాలని సూచించారు. సంబంధిత డిపార్ట్‌మెంట్ డాక్టర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

Next Story