మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. మహిళలకు రూ. 35 కోట్ల జీరో వడ్డీ రుణాల పంపిణీ

హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం మాసాబ్ ట్యాంక్‌లోని చాచా నెహ్రూ పార్క్‌లో 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక'...

By -  అంజి
Published on : 7 March 2026 8:18 AM IST

Ponnam Prabhakar, Praja Palana 99 Days Plan, Glass Library Hyderabad, E-Waste Collection Kiosk, Indira Mahila Shakti Canteen, SHG Zero Interest Loans, Chacha Nehru Park Masab Tank

మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. మహిళలకు రూ. 35 కోట్ల జీరో వడ్డీ రుణాల పంపిణీ

హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం మాసాబ్ ట్యాంక్‌లోని చాచా నెహ్రూ పార్క్‌లో 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణను ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, వార్డులు మరియు మున్సిపాలిటీల్లో అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ 99 రోజుల ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల (e-waste) సేకరణ కేంద్రాలను ప్రారంభించారు. ఇళ్లలో పాడైపోయిన టీవీలు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు వంటి పరికరాలను ఈ కియోస్క్‌లకు తీసుకువచ్చి రీసైక్లింగ్ చేయాలని మంత్రి సూచించారు. విశేషమేమిటంటే, ఈ వ్యర్థాలను అందించిన వారికి వస్తువుల విలువను బట్టి రూ. 500 నుండి రూ. 1000 వరకు డిస్కౌంట్ కూపన్లు లేదా బహుమతులు అందజేస్తారు.

పార్కులో 1500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన వినూత్నమైన 'అద్దాల లైబ్రరీ'ని మంత్రి ప్రారంభించారు. గోడలకు బదులుగా అద్దాలతో నిర్మించిన ఈ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ మరియు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 35 కోట్ల జీరో వడ్డీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 'ఇందిరా మహిళా శక్తి' క్యాంటీన్‌ను ప్రారంభించారు. మహిళా సంఘాలు ముందుకు వస్తే ఆర్టీసీ బస్సులను అందించి వారిని యజమానులుగా మారుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కలెక్టర్ హరి చందన దాసరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story