'బ్యాంక్ వివరాలు అడగట్లేదు'.. కుల గణనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకి ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించాలని ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
By అంజి Published on 11 Nov 2024 9:46 AM IST
'బ్యాంక్ వివరాలు అడగట్లేదు'.. కుల గణనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడలో శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని.. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్.. స్వామి వారికి గోపూజ నిర్వహించి కోడే మొక్కులు చెల్లించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకి ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించాలని ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఓట్ల కోసం తమ ప్రభుత్వం కుల గణన సర్వే చేయట్లేదని తెలిపారు. బ్యాంకు డిటేయిల్స్, పాన్ వివరాలు అడగట్లేదని, ఇష్టం ఉంటేనే కులం, ఆధార్ వివరాలు వెల్లడించవచ్చని తెలిపారు.
''సమగ్ర కుటుంబ సర్వే ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదు.. బలహీన వర్గాలకు మాత్రమే పరిమితమైంది కాదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సమాచారం'' అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసిందని అంటున్నారని, అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా అని పొన్నం ప్రశ్నించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన కేటీఆర్‌కు మాట్లాడే అర్హత ఎక్కడిదన్నారు.
''కేటీఆ్.. మీ పార్టీలో బీసీలకు ఎక్కడ న్యాయం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ కుల సర్వే దేశ వ్యాప్తంగా జరగాలని డిమాండ్ వస్తోంది. కుల సర్వే ఇష్టం లేని బీజేపీ, తెలంగాణలో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్న బీఆర్‌ఎస్ కలిసి సర్వేను అప్రతిష్టపాలు చేయాలని చూస్తోంది. జీవో నెంబర్ 18 ద్వారా యావత్ తెలంగాణలో సమాచారం సేకరించి అసమానతలు తొలగించి అన్ని రకాలుగా న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకుపోతున్నాం'' అని మంత్రి పొన్నం తెలిపారు.
''సర్వేకు ప్రజలు సహకరించాలి.. బ్యాంకు డిటైల్స్ అడగడం లేదు.. ఆప్షనల్ గా ఆధార్ అడుగుతున్నారు.. ప్రజల స్థితిగతులు తెలవడానికి ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. సమాచార సేకరణ కు వస్తున్న ఎన్యుమరేటెర్స్ కి సమాచారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితం కావద్దని కోరుతున్నా. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చింది. భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు పోతున్నాం'' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.