హైదరాబాద్: ప్రజలకు సులువుగా, వేగవంతంగా సేవలు అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించిన స్లాట్ బుకింగ్ విధానానికి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిన్న ప్రయోగాత్మకంగా చేపట్టిన 22 చోట్ల 626 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలిపారు. ఈ విధానంలో దళారుల ప్రమేయం ఉండబోదని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుండటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రజలకు సులువుగా వేగవంతమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. రెవెన్యూ విభాగంలో ఎలాంటి సంస్కరణ చేపట్టినా అది పబ్లిక్ యాంగిల్‌లోనే ఉండాలని అధికారులకు సూచించారు. స్లాట్ బుకింగ్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండదన్నారు.