రిజిస్ట్రేషన్లపై గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ మంత్రి పొంగులేటి

సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.

By Knakam Karthik
Published on : 8 April 2025 3:29 PM IST

Telangana, Minister Ponguleti Srinivasreddy, registration Offices, Slot Booking

రిజిస్ట్రేషన్లపై గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ మంత్రి పొంగులేటి

తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు సమర్థవంతంగా సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించే ప‌నిలేకుండా కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌య్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నామ‌ని మంగ‌ళవారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు.

రాష్ట్రంలో 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు గాను మొద‌టి ద‌శ‌లో ప్ర‌యోగాత్మ‌కంగా 22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఈనెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమ‌లులోకి తీసుకురాబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చ‌ల్ జిల్లా కుత్బుల్లాపూర్‌, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, స‌రూర్ న‌గ‌ర్‌, చంపాపేట్, పెద్ద‌ప‌ల్లి జిల్లా రామగుండం, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం (R.O), మేడ్చల్ (R.O), మహబూబ్ నగర్(R.O), జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ మొత్తం 22 చోట్ల ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్నామ‌ని తెలిపారు.

సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వలన జరిగే జప్యాన్ని నివారించడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రోజు వారి పని వేళలను 48 స్లాట్లుగా విభజించడం జరిగింద‌న్నారు. ప్రజలు నేరుగా “registration.telangana.gov.in” వెబ్-సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్ధేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చన్నారు. స్లాట్ బుక్ చేసుకోనివారికోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్ల‌ను అనుమతిస్తార‌ని, నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో దస్తావేజులు స్వీకరిస్తార‌ని తెలిపారు.

Next Story