హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం జూన్2వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం రూ.8.19 లక్షల కోట్ల అప్పులు మిగిల్చినా.. తాము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు. కాగా రాజీవ్ యువ వికాసం యూనిట్ల మంజూరు కోసం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు, మండల కమిటీలు, జిల్లా కమిటీ కీలకంగా వ్యవహరించనున్నారు.
క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మండల స్థాయి స్క్రీనింగ్ కమిటీ మళ్లీ పరిశీలిస్తుంది. తర్వాత లబ్ధిదారుల లిస్ట్‌ను జిల్లా కమిటీకి అందిస్తారు. జిల్లా కమిటీ ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదంతో జూన్ 2న రాయితీ రుణాలను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ద్వారా మంజూరు చేయిస్తారు. మండల కమిటీలో మండల ప్రజా పరిషత్ అధికారి/మున్సిపల్ కమిషనర్లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. మండల ప్రత్యేకాధికారి, బ్యాంకు మేనేజర్లు, కార్పొరేషన్ల ప్రతినిధులు, డీఆర్డీఏ ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తారు. జిల్లా కమిటీలో కలెక్టర్ ఛైర్మన్‌గా, డీఆర్డీఏ కన్వీనర్, ఆయాశాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు.