తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. 'ప్రజలను మీరు మోసం చేశారంటే.. మీరు మోసం చేశారని' విరుచుకుపడుతున్నారు. తాజగా మంత్రి కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. బీజేపీ పెద్దల అవినీతి వల్లే రూపాయి విలువ పడిపోతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మోదీ ప్రధాని అయ్యాక తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని ఆరోపించారు.
''మొదటి సర్వే బీజేపీది, రెండో సర్వే కాంగ్రెస్‌ది. ఈ రెండు సర్వేలు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎసే గెలుస్తుందని తేల్చాయి. మా ప్రత్యర్థుల సర్వేలు కూడా టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పాయి. వచ్చే ఎన్నికల్లో 90కిపైగా నియోజకవర్గాల్లో గెలుస్తాం. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బీజేపీకి మండల స్థాయి నాయకులు కూడా లేరు. కాంగ్రెస్‌కు కూడా కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. కట్టప్పల గురించి కేసీఆర్ వివరంగా చెప్పారు'' అని కేటీఆర్ అన్నారు.
షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రధాని మోదీ పర్సనల్ విజిట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకాల్సిన అవసరం లేదన్నారు. ''మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. గతంలో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ గుజరాత్‌కు వస్తే ఎందుకు రిసీవ్ చేసుకోలేదు'' అని కేటీఆర్ ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసైతో తమకు ఎలాంటి పంచాయితీ లేదన్నారు.