నారాయణపేటలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏబీవీపీ
Minister KTR visits Narayanpet Dist.నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
By తోట వంశీ కుమార్ Published on 10 July 2021 1:08 PM ISTనారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో నారాయణపేట జిల్లా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్.. 10గంటలకు నారాయణపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును కేటీఆర్ ప్రారంభించారు. బస్ డిపోకు ఎదురుగా రూ.6కోట్లతో చేపడుతున్న వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో రూ.20లక్షలతో నిర్మించనున్న అమరవీరుల స్తూపం పనులను ప్రారంభించారు. అనంతరం సింగారం క్రాస్ రోడ్డులో చేనేత శిక్షణ, ఉత్పత్తి కేంద్రం, అంబేడ్కర్ చౌరస్తా పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కలెక్టర్ హరిచందనతో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నారాయణపేట చేనేత కళాకారులందరికీ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రూ. 10 కోట్లతో నైపుణ్య శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ శిక్షణ కేంద్రం వల్ల చేనేత కార్మికులకు అపారమైన లాభం జరుగుతుందన్నారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర పథకాల వల్ల కార్మికులు లాభం పొందుతున్నారు. నేతన్న చేయూత కార్యక్రమం ద్వారా గతేడాది రూ. 96 కోట్లు విడుదల చేశామన్నారు. కరోనా సమయంలో ఈ నిధుల వల్ల కార్మికులకు లాభం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. 50 శాతం సబ్సిడీ మీద నూలు, రసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని నేత కార్మికులందరూ వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
మంత్రి కాన్వాయ్ అడ్డగింత..
మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని ఏబీవీపి కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో చిన్న పిల్లల ఐసీయూ వార్డు ప్రారంభానికి వెలుతున్న క్రమంలో ఏబీవీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. నారాయణపేటకు పీజీ కళాశాల మంజూరు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థల అధిక ఫీజులు నియంత్రణ చేయాలంటూ నినాదాలు చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో నిరసనకారలపై పోలీసుల లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పలువురుఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.