తెలంగాణ‌కు పెట్టుబడులు రాబట్టే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌

Minister KTR Tour To United States of America.రాష్ట్రానికి మ‌రిన్ని పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చే ల‌క్ష్యంగా ఐటీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2022 6:52 AM GMT
తెలంగాణ‌కు పెట్టుబడులు రాబట్టే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌

రాష్ట్రానికి మ‌రిన్ని పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చే ల‌క్ష్యంగా ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఇత‌ర ఉన్న‌తాధికారుల బృందం శ‌నివారం అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో ఈ బృందం ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌లు కంపెనీల‌కు చెందిన అధిప‌తులు, సీనియ‌ర్ ప్ర‌తినిధి బృందాల‌తో స‌మావేశ‌మ‌వుతారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నారు. ప‌ది రోజుల పాటు ఈ ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. ప్ర‌పంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పలు ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల కంపెనీలతో భేటీ కానున్నారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు హబ్‌గా మారింది. ప్ర‌పంచ స్థాయి సంస్థ‌లైన గూగుల్, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి ప్రపంచ సంస్థలు హైద‌రాబాద్‌ను త‌మ వ్యాపార విస్తరణకు కేంద్రంగా మార్చుకున్నాయి. కేవ‌లం ఐటీ కంపెనీలే కాకుండా ఆటోమోబైల్, ఫార్మా, బ‌యో, లైఫ్ సైన్సెస్‌, టెక్స్‌ టైల్స్ వంటి సంస్థ‌లు కూడా హైద‌రాబాద్‌లో త‌మ కార్యాల‌యాల‌ను తెరిచాయి. కాగా.. గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులను తీసుకువచ్చిన మంత్రి కేటీఆర్.. ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులను తీసుకు వచ్చే అవకాశం ఉంది. మంత్రి కేటీఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలు ఐటీ శాఖకు చెందిన పలు విభాగాల డైరెక్టర్లు వెలుతున్నారు.

Next Story
Share it