కరోనా సెకండ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్యులు, సెలబ్రెటీలు అన్నతేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే.. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా నిబంధనలను పాటించాలని మంత్రి ట్వీట్ చేశారు.
కాగా ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. అటు టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు కరోనా బారిన పడటంతో నేతల్లోనూ ఆందోళన మొదలైంది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 1,05,602 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌బులిటెన్‌లో తెలిపింది. అలాగే 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.