తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా కట్టడికి నిధుల కొరత లేదన్నారు. ఇతర రాష్ట్రాల కరోనా రోగులకు కూడా తెలంగాణలో చికిత్స అందుతోందని ఆయన చెప్పారు. ఔషధాలు, ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు.
ఆదివారం గ్రీన్‌కో సంస్థ ప్రతినిధులు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్‌కు అందజేశారు. గ్రీన్‌కో సంస్థ ప్రభుత్వానికి అందజేసేందుకు చైనా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను దిగుమతి చేసుకుంది. కార్గో విమానంలో శంషాబాద్ చేరగా వాటిని విమానాశ్రయంలోనే కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచి, 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన గ్రీన్‌కో సంస్థకు మంత్రి కేటీఆర్, సీఎస్ ధన్యవాదాలు తెలిపారు.