TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ రాజకీయ అజ్ఙాని అని, ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై అవగాహన లేని వ్యక్తి బండి సంజయ్ అని అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రభుత్వ శాఖ కాదని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని అన్నారు. ఓ వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారని వివరణ ఇచ్చారు. రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా ఉద్యోగాల సాధనపైనే యువత దృష్టి పెట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. గుజరాత్‌లో 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అని ప్రశ్నించారు.
నిరుద్యోగ యువకుల ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రభుత్వం లక్ష్యమని, ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను టీఎస్‌పీఎస్సీకి అందిస్తామని తెలిపారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలను చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్ల తమ నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదని అన్నారు మంత్రి కేటీఆర్.