Delhi Liquor Scam: అవి ఈడీ సమన్లు కావు.. మోదీ సమన్లు: కేటీఆర్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు పంపిన అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
By అంజి Published on 9 March 2023 2:11 PM IST
అవి ఈడీ సమన్లు కావు.. మోదీ సమన్లు: కేటీఆర్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు పంపిన అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కవితకు పంపినవి ఈడీ సమన్లు కాదని.. మోదీ సమన్లు అంటూ ఆరోపణలు చేశారు. కవితకు సమన్లు పంపడం వెనుక కేంద్రం ఉందన్నారు. కేంద్రం మోసాలు, గారడీలు చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో చట్టబద్ధంగా విచారణను ఎదుర్కొంటామని కేటీఆర్ అన్నారు. అయితే గౌతం అదానీ విషయంలో విచారణను ఎదుర్కొనే దమ్ము ప్రధాని మోదీకి ఉందా? అని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్న మంత్రి కేటీఆర్.. మోదీకీ, ఈడీకీ భయపడేది లేదన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కామ్ జరిగిందని బీజేపీ ఆరోపిస్తోందని, కానీ వాస్తవానికి స్కామ్‌లు చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వమే అని కేటీఆర్ అన్నారు. దేశంలో ఒక సంస్థకు రెండు కంటే ఎక్కువ ఎయిర్‌పోర్టులు ఉండకూడదని నిబంధనలు చెబతున్నాయని, కానీ ఆ నిబంధనలను తుంగలో తొక్కి అదానీకి ఆరు ఎయిర్పోర్టులు ఇచ్చారని, ఇదొ పెద్ద స్కామ్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులతో పాటు జీవీకే ముంబయి ఎయిర్‌పోర్టును అదానీ కోసం బలవంతంగా లాక్కున్నారని కేటీఆర్ ఆరోపించారు.
అదానీ ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల హెరాయిన్ దొరికిందని, కోట్ల విలువైన కొకైన్ దేశంలోకి వస్తోందని, వారి ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. ఆస్ట్రేలియాలోని అదానీ గనుల నుంచి మాత్రమే బొగ్గు కొనాలని పాలసీ చేయడం ఒక స్కామ్ అని కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్‌లో మద్యపాన నిషేధం ఉందని, అయినా లిక్కర్ తాగి 42 మంది చనిపోయారన్నారు. అదానీతో సంబంధాల మీద నరేంద్ర మోదీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో 95 శాతం దాడులు విపక్ష నేతలపైనే జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు.