ప్రవాసుల మద్ధతు చాలా గొప్పగా ఉంటుంది: కేటీఆర్‌

Minister KTR participated in the 'Meet and Greet' program in Switzerland. నేటి నుంచి ఐదు రోజుల పాటు స్విట్జర్లాండ్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు

By అంజి  Published on  16 Jan 2023 11:30 AM IST
ప్రవాసుల మద్ధతు చాలా గొప్పగా ఉంటుంది: కేటీఆర్‌

నేటి నుంచి ఐదు రోజుల పాటు స్విట్జర్లాండ్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్‌ వెళ్లారు. అక్కడి వెళ్లిన తర్వాత మంత్రి కేటీఆర్‌కు స్థానికులు ఘనంగా స్వాగతం చెప్పారు. అక్కడే నిర్వహించిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్ మాట్లాడారు. ప్రవాస భారతీయులకు దేశ వ్యవహారాలు, స్థానిక అంశాలు, అభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందన్నారు. దావోస్‌ వచ్చిన ప్రతిసారీ స్విట్జర్లాండ్‌లో ఉన్న ప్రవాస భారతీయుల సపోర్ట్‌ చాలా గొప్పగా ఉంటుందన్నారు.

మానవ జీవితం పరిమిత కాలం అనే సిద్ధాంతాన్ని నమ్మాం, అందుకే సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ శాఖ వల్ల కొంత ప్రచారం లభిస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలోని అన్ని శాఖలు అద్భుతమైన పనితీరుతో ముందుకెళ్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని సాధించిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు దేశంలోనే ఆదర్శవంతంగా ఉన్నాయన్నారు. అనంతరం దావోస్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించిన మకర సంక్రాంతి వేడుకల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు.

నేటి నుంచి ఐదు రోజుల పాటు దావోస్‌ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుంది. ఈ సదస్సును ‘విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం’’ అనే అంశంతో నిర్వహించనున్నారు. 52 దేశాల అధినేతలు, 130 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారు.

Next Story