రైతులు, పేదలకు ప్రత్యేక ప్యాకేజ్..త్వరలో సీఎం ప్రకటన: కేటీఆర్
కేసీఆర్ పేదలు, రైతుల కోసం ఆలోచించే వ్యక్తి అని.. త్వరలోనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పారు మంత్రి కేటీఆర్.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 10:12 AM ISTరైతులు, పేదలకు ప్రత్యేక ప్యాకేజ్..త్వరలో సీఎం ప్రకటన: కేటీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ జోరుగా హామీల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పథకాలంటే రెట్టింపు చేసి లబ్ధిదారులకు అందిస్తామని చెబుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుల హామీలపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు కొనసాగిస్తున్నారు. ముందుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చెబుతున్న హామీలు అమలు చేయాలని.. ఆ తర్వాత తెలంగాణ గురించి మాట్లాడాలని మండిపడుతున్నారు. అయితే.. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ నాయకుల హామీలను నమ్మొద్దని.. వారి చెప్పేవన్నీ అమలుకు వీలుకాని మాటలని చెప్పారు. సీఎం కేసీఆర్ పేదలు, రైతుల కోసం ఆలోచించే వ్యక్తి అని.. వారి కోసం త్వరలోనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పారు మంత్రి కేటీఆర్.
తెలంగాణలోని పేదల కోసం మరిన్ని పథకాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పేదలు, రైతుల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ ఉండబోతున్నదని.. త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ విషయాలను ప్రకటిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు తామె ఈ ఎన్నికల్లోనూ గెలవలేమని తెలిసే.. ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. అయితే.. ప్రతిపక్ష నాయకులు చెప్పేదాని కంటే ఎక్కువ సంక్షేమం అందించాలన్నదే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ఆ విషయాలను అన్నింటినీ సీఎం కేసీఆర్ త్వరలో ప్రకటిస్తారని.. ప్రజలు తొందరపడవద్దని కోరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లో డబుల్‌బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఏర్పాటైన తొమ్మిదేళ్లలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం ప్రగతి బాటలో ముందుకెళ్తుందని కేటీఆర్ చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో మంచినీళ్ల కోసం లొల్లి ఉండేదని చెప్పారు. ఎప్పుడు చూసినా ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు పెట్టి ధర్నాలు చేసేవారని గర్తుచేశారు. ఇవాళ నగరంలో ఆ పరిస్థితులు లేవని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని అన్నారు. రోడ్లు బాగుచేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగింపు సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం అవుతుందని.. ఢిల్లీ బెంగళూరు నుంచి వచ్చి బూటకపు హామీలు ఇచ్చేవారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదే అని కేటీఆర్ అన్నారు.