రూ. 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్మేందుకు మోదీ సర్కారు యత్నం: కేటీఆర్
Minister KTR Letter to Nirmala Sitharaman. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు
By Medi Samrat Published on 19 Jun 2022 6:00 PM ISTప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం కథలు చెబుతోందన్నారు. దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అమ్ముతోందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీతో పాటు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలో ఉన్న హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, HMT, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని ఆరోపించారు కేటీఆర్. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువ 40 వేల కోట్లు ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామికాభివృధ్ది జరగాలన్న ఉదాత్తమైన లక్ష్యంతో గతంలో ఆయా కంపెనీలకు అత్యంత తక్కువ ధరకు, అనేక సందర్భాల్లో ఉచితంగానే భూములు కేటాయించిన సంగతిని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే తమ ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు కేటీఆర్. ఆయా సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో ప్రయివేట్ పరం చేయడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్టుగానే ఇక్కడి ప్రజలు భావిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని లేఖలో చెప్పుకొచ్చారు కేటీఆర్.