ఏడేళ్లు కరువొచ్చినా తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ప్లాన్ : మంత్రి కేటీఆర్
Minister KTR Laying Foundation Stone to Sunkishala Intake well station.వరుసగా ఏడేళ్లు కరువు వచ్చినా తాగు నీటికి
By తోట వంశీ కుమార్ Published on 14 May 2022 7:40 AM GMTవరుసగా ఏడేళ్లు కరువు వచ్చినా తాగు నీటికి ఎలాంటి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్ పనులకు శనివారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలకు నిజంగా ఈ రోజు శుభదినం అని అన్నారు. హైదరాబాద్ నగరానికి 2072 వరకు తాగునీటికి ఇబ్బందులు ల్లేకుండా ముందు చూపుతో ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. వరుసగా ఏడేళ్ల పాటు కరువు వచ్చినా తాగునీటికి ఎలాంటి తిప్పలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోట్ల మందిని దృష్టిలో ఉంచుకుని రూ.1,450 కోట్లతో సుంకిశాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పంపులు, మోటార్లతో పాటు అదనంగా 16 టీంఎసీలు లిఫ్ట్ చేయడానికి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. రాబోయే ఎండా కాలం కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు.
భవిష్యత్తులో హైదరాబాద్ నగరం 100కిలోమీటర్ల విస్తరించినా తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి 37 టీఎంసీల నీటి అవసరం ఉంది. 2072 నాటికి దాదాపు 77 టీఎంసీల నీటి అవసరం ఉండే అవకాశం ఉందన్నారు. నగరం ఎంత విస్తరించినా రాబోయే తరాలకు నీటి కొరత లేకుండా సుంకిశాల ఉపయోగపడుతుందన్నారు.