దేశంలోని ఇతర నగరాల కంటే మౌలిక వసతుల్లో, నివాసయోగ్యంలో హైదరాబాద్ నగరం ముందు ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సెంటర్‌లో అమెరికాకు చెందిన కాల్అవే గోల్ఫ్ సంస్థ కార్యాలయన్ని గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాల్‌అవే సంస్థ ఆఫీస్ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలోని శాండియాగోలో ఉందని, రెండో కార్యాలయం కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇక రాష్ట్రంలో డిజిటల్ కంపెనీలు చాలా ఉన్నాయన్నారు. ఆపిల్, గూగుల్, ఉబర్, నోవార్టిస్ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని చెప్పారు. ఆయా సంస్థల రెండో పెద్ద కార్యాలయాలు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అమెజాన్ అతిపెద్ద సెంటర్ నగరంలో ఉందని చెప్పారు. కాల్‌అవే సంస్థ కూడా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు.
కాగా.. కాల్‌అవే గోల్ఫ్ సంస్థ హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా సుమారు 300 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.