కాంగ్రెస్ నిజస్వరూపం ఇదే: మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ఆలోచనా విధానాలపై ఇవాళ, రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది.
By అంజి Published on 11 July 2023 11:15 AM ISTకాంగ్రెస్ నిజస్వరూపం ఇదే: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ఆలోచనా విధానాలపై ఇవాళ, రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మల దహనానికి బీఆర్‌ఎస్ పిలుపు నిచ్చింది. ఉచిత విద్యుత్ రద్దు చేయాలన్న కాంగ్రెస్ ఆలోచన దుర్మార్గమైనదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అసలు నిజ స్వరూపం ఇదేనన్నారు. గతంలోనూ విద్యుత్ ఇవ్వకుండా కాంగ్రెస్ రైతులను గోసపెట్టిందని గుర్తు చేశారు.
రైతు వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ మరోసారి బయటపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఆలోచనా విధానాన్ని తెలంగాణ ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఎన్‌ఆర్‌ఐలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి వచ్చిన వారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తుంది? సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న నిరంతరాయ విద్యుత్ స్కీమ్‌ను కొనసాగిస్తారా? లేదా? అని అడిగారు.
దీనికి రేవంత్ సమాధానం ఇస్తూ.. తెలంగాణలో 3 ఎకరాల లోపు ఉన్న రైతులు మాత్రమే ఉన్నారని, దానికి 3 గంటల కరెంట్ ఉంటే సరిపోతుందన్నారు. ఈ లెక్కన రోజుకు 8 గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటల విద్యుత్ అనవసరం అని రేవంత్ అన్నారు. ఈ పథకంతో కేసీఆర్ రైతులను మభ్యపెడుతున్నారని అన్నారు. విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్ల కోసమే ఉచిత కరెంట్ పథకాన్ని వాడుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
బిగ్ బ్రేకింగ్ న్యూస్!
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2023
రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు.. కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. అనవసరంగా ఉచితాలు ఇవ్వొద్దు - అమెరికా పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి pic.twitter.com/6oGF14VXpx