ఎక్కువ చేస్తే కరెంట్, వాటర్ సప్లై బంద్ చేస్తాం.. మంత్రి కేటీఆర్ వార్నింగ్
Minister KTR fire on Cantonment officials.తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు శనివారం కొనసాగుతున్నాయి.
By తోట వంశీ కుమార్
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు శనివారం కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ హైదరాబాద్ అభివృద్దికి అడ్డుపడుతున్న కంటోన్మెంట్ అధికారులపై మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా కార్వాన్ నియోజకవర్గంలో నెలకొన్న నాలా ల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోమన్నారు.
ఒక వైపు కంటోన్మెంట్‌లో చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోందన్నారు. శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. ఒక వైపు కంటోన్మెంట్, మరో వైపు ఏఎస్ఐ అడ్డు పడుతోందని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ వేరే దేశం అన్నట్టు కేంద్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు కంటోన్మెంట్ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. కానీ ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్ చేస్తాం.. నాలాల మీద చెక్ డ్యాంలు కడుతామంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తామని.. అవసరమైతే మంచినీళ్లు, కరెంట్ బంద్ చేస్తామని.. అప్పుడైనా దిగిరారా అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Live: Replying to a question on 'Strategic Nala Development Program (SNDP) in Hyderabad' city https://t.co/7Fw8Zxdo5E
— KTR (@KTRTRS) March 12, 2022
ఇక హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు శ్రమిస్తున్నట్లు తెలిపారు. రూ.3,886 కోట్లతో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ నాటికి వందశాతం ఎస్‌టీపీ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. పైసా సాయం కూడా చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో గతేడాది వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అప్పుడు కేంద్ర మంత్రులు వచ్చి ఫోటోలు దిగి వెళ్లిపోయారు. పైసా సాయం చేయలేదు. అదే గుజరాత్‌లో వరదలు వస్తే రూ.1000 కోట్లు సాయం ప్రకటించారని కేటీఆర్ అన్నారు.