తెలంగాణకు వాళ్లేం చేయలేదు.. ఇప్పుడెలా నమ్ముతాం: మంత్రి కేటీఆర్

గత 57 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఏ ప్రభుత్వం గొప్పగా ఏం చేయలేదని విమర్శించారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని..

By Srikanth Gundamalla  Published on  20 Jun 2023 10:46 AM GMT
Minister KTR, Sircilla, Ellareddipet, BRS, BJP

తెలంగాణకు వాళ్లేం చేయలేదు.. ఇప్పుడెలా నమ్ముతాం: మంత్రి కేటీఆర్

గత 57 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఏ ప్రభుత్వం గొప్పగా ఏం చేయలేదని విమర్శించారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో ఆయన పర్యటించారు. టూర్‌లో భాగంగా రూ.8.5 కోట్లతో అభివృద్ధి చేసిన విద్యా క్యాంపస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు.

ఎవరో వచ్చి ఏదో మాట్లాడగానే ప్రజలు ఆగమాగం కావొద్దన్నారు మంత్రి కేటీఆర్. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. రాష్ట్రం ఎవరి వల్ల బాగుపడుతుందో తెలుసుకోవాలని చెప్పారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా తెలంగాణకు పెద్దగా ఏం చేయలేదని విమర్శించారు. ఇప్పుడొచ్చి ఏవో మాయమాటలు చెప్పే వారిని నమ్మకూడదన్నారు. తెలంగాణను సాధించిన పార్టీ, కేసీఆర్‌ ఉన్నంత వరకు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ప్రతి పైసా సమగ్రంగా ఆలోచించి ప్రజాక్షేమం కోసమే ఖర్చుపెడుతున్నామని అన్నారు మంత్రి కేటీఆర్.

గతంలో ఒక బడి తెద్దామని ఆలోచించలేదు.. గుడి కడదామని ఆలోచంచలేదు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. బండి సంజయ్‌ అయితే కరీంనగర్‌ పార్లమెంట్‌కు అర పైసా సాయం కూడా చేయలేదని విమర్శించారు. ఒక్క నవోదయ స్కూల్‌ అయినా తెచ్చారా.? కస్తూర్బా కాలేజీ వచ్చిందా..? మెడికల్‌ కాలేజ్‌.. నర్సింగ్‌ కాలేజ్‌ మంజూరు చేయించగలిగారా అని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా డిగ్రీ కాలేజ్‌ గురించి బండి సంజయ్ ఎలా మాట్లాడతారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.

ప్రజల కోరిక మేరకు ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజ్‌ ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. బండి సంజయ్‌ అడిగినందుకు కాదు.. ఎల్లారెడ్డిపేట ప్రజలపై ప్రేమతో కేసీఆర్‌ డిగ్రీ కాలేజ్‌ను మంజూరు చేస్తారని చెప్పారు. బీజేపీ నాయకులకు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం.. విద్వేషాలను రెచ్చగొట్టడం మాత్రమే తెలుసని మండిపడ్డారు. కేంద్రం నుంచి కాలేజ్‌లను తీసుకొద్దామనే ఆలోచన ఒక్కరూ చేయరని విమర్శించారు. బండి సంజయ్‌ సహా ఇతర బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రం ఉంచి కరీంనగర్‌కు ఒక ట్రిపుల్‌ ఐటీ కాలేజ్‌ తీసుకురావాలని సవాల్‌ విసిరారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల ఇప్పటికే ఎంతో అభివృద్ది చెందిందని చెప్పారు. సిరిసిల్ల జిల్లాను విద్యా ప్రమాణాల్లో దేశంలోనే ఆదర్శంగా చేయాలని అధికారులను కోరారు మంత్రి కేటీఆర్.

Next Story