హైదరాబాద్ నగరంలో మెట్రో ఛార్జీల పెంపులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఛార్జీల నిర్ణయాధికారాన్ని కేంద్ర ప్రభుత్వం మెట్రో నిర్వహణ సంస్థలకే కట్టబెట్టిందన్నారు. కేంద్రం తీసుకువచ్చిన మెట్రో యాక్ట్ ప్రకారం ఛార్జీలు ఎంత వసూలు చేయాలని నిర్ణయించుకునే అధికారం నిర్వహణ సంస్థలకే ఉందన్నారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. నగరంలో మెట్రో రైల్ కొత్త పనులకు కేంద్రం మోకాలడ్డుతోందన్నారు. ప్రతిపాదనలు పంపినా స్పందించడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మెట్రోలకే నిధులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో నిర్వహణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థ చూస్తోంది. మెట్రో చార్జీలు పెంచాలని నిర్ణయించి అమలు చేసింది ఆ సంస్థే నన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం తరపున తగిన సూచనలు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అడ్డగోలుగా ధరలు పెంచితే ఉరుకోమని హెచ్చరించినట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలతో సమానంగా ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
రూ.6250 కోట్లతో ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టామన్నారు. మూడు సంవత్సరాల్లో శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్ అని అందరికీ తెలుసన్న మంత్రి.. పాతబస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.