ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు..? లెక్కలు తెలుసుకోండి
Minister KTR Counter on MP Laxman comments.ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
By తోట వంశీ కుమార్
సొమ్ము కేంద్రానిది.. సోకు టీఆర్ఎస్ దని ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారో ముందుగా లక్ష్మణ్ తెలుసుకోవాలన్నారు. సోషల్ మీడియా వేదికగా 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి కేంద్రం వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని పోస్ట్ చేశారు.
ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు..? ఎంపీ లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబ్ యూపీ.. తెలంగాణ సొమ్ముతో సోకులు పడుతోంది. దేశ అభివృద్ధికి దోహపడుతున్నందుకు తెలంగాణకు ధన్యవాదాలు తెలపాలి. లెక్కలు తెలుసుకోండి. అంతేకానీ ప్రజలకు మభ్య పెట్టొద్దు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు Dr.Laxman గారు?
— KTR (@KTRTRS) September 22, 2022
తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తర ప్రదేశ్ సోకులు పడుతున్నది
తెలంగాణ దేశ అభివృద్ధికి దోహద పెడుతున్నందుకు థాంక్స్ చెప్పండి
లెక్కలు తెలుసుకోండి👇 ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం కానీ ప్రజలని మభ్య పెట్టకండి pic.twitter.com/VrShH3nnPh
లక్ష్మణ్ ఏమన్నారంటే..?
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సంఘం, ఇతర సంక్షేమ పథకాలతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని,రాష్ట్రంలో పరిస్థితి సొమ్ము కేంద్రానిది అయితే సోకు టీఆర్ఎస్‌ది అయ్యిందని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ యువమోర్చ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రజాగోస-బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బుధవారం ఆయన నారాయణపేట జిల్లా దామరగిద్దలో బైక్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఉచిత బియ్యంతో కేంద్ర ప్రభుత్వం దేశంలోని 80 కోట్ల మందికి ఆపన్న హస్తం అందిస్తుందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ పేర్లు మారుస్తూ తామే అమలు చేస్తున్నట్లు మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల, ఫసల్ భీమా యోజన, గ్రామాలకు రహదారులు, పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు అందిస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తామే చేపడుతున్నామంటూ గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని ఆయన విమర్శించారు.