కాంగ్రెస్‌, బీజేపీలకు అభివృద్ధిపై విజన్‌ లేదు: మంత్రి కేటీఆర్

తొమ్మిదిన్నర ఏళ్లలో సీఎం కేసీఆర్ పాలన సాధించిన ఘనత ఇదేనని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్.

By Srikanth Gundamalla  Published on  28 Oct 2023 8:57 AM GMT
minister, ktr,  hyderabad, meet the press,

 కాంగ్రెస్‌, బీజేపీలకు అభివృద్ధిపై విజన్‌ లేదు: మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి అయ్యిందని చెప్పారు. తొమ్మిదిన్నర ఏళ్లలో సీఎం కేసీఆర్ పాలన సాధించిన ఘనత ఇదేనని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్.

నేడు తెలంగాణ చేస్తున్నదే.. రేపు దేశం ఆచరిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.లక్షా 14 వేలుగా ఉందని, ప్రస్తుతం అది రూ.3లక్షల 17 వేలకు పెరిగిందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఎలాంటి వివక్ష, కులమత భేదాలు లేకుండా తెలంగాణ ప్రజలు జీవిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమన్నారు కేటీఆర్. అభివృద్ధిలో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్రగామని ఉందని అన్నారు. అలాగే అప్పులు చేసిన నిధులను సంపద సృష్టికి ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. రుణాలు మొత్తం సాగునీటి రంగం, మిషన్ భగీరథకు ఉపయోగించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని మంత్రి కేటీఆర్ అన్నారు.

బీఆర్ఎస్‌ పాలనలో ఇటు పట్టణాలు.. అటు పల్లెలను సమతుల్యంగా అభివృద్ధి చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయని గుర్తు చేశారు. ఐటీ రంగంలో బెంగళూరుని మొదటగా చెప్పేవారు అని.. కానీ ఇప్పుడు హైదరాబాద్‌ను ఐటీకి కేంద్రంగా చెప్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ ఎగుమతులు 400 శాతం పెరిగాయని వెల్లడించారు. అలాగే ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామని ఉందన్నారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగిందన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి చాలా వెళ్తున్నా.. తిరిగి కేంద్రం తెలంగాణకు ఇచ్చింది మాత్రం గుండు సున్నా అంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

తెలంగాణ ఆకాంక్షకు కాంగ్రెస్ దశాబ్దాల పాటు అణచివేసిందని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా మోసం చేశారన్నారు. దాంతో.. వందల మంది బలిదానాలకు కారణమయ్యారని చెప్పారు. సోనియాను బలిదేవత అన్నది రేవంత్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ , బీజేపీలకు అబివృద్ధిపై విజన్ లేదని విమర్శించారు మంత్రి కేటీఆర్. అధికారం కోసమే పాకులాడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి మేలు చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనపైనే ప్రజలకు నమ్మకం ఉందన్నారు. మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఏం చేశారంటూ ప్రశ్నించారు. ప్రతీకార రాజకీయాలు చేస్తే రేవంత్‌ ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడని చెప్పారు. అభివృద్ధికి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

Next Story