బాస‌ర ఆర్జీయూకేటీలో రెండో రోజూ నిర‌స‌న‌.. విద్యార్థుల ఆందోళ‌న‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్‌

Minister KTR assures protesting students in IIIT Basara.నిర్మ‌ల్ జిల్లాలోని ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆందోళ‌న రెండో రోజూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2022 12:39 PM IST
బాస‌ర ఆర్జీయూకేటీలో రెండో రోజూ నిర‌స‌న‌.. విద్యార్థుల ఆందోళ‌న‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్‌

నిర్మ‌ల్ జిల్లాలోని ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆందోళ‌న రెండో రోజూ కొన‌సాగుతోంది. విద్యాల‌యంలో నెల‌కొన్న స‌మ‌స్య‌లు, సౌక‌ర్యాల కొర‌త‌, సామాగ్రి స‌ర‌ఫ‌రాలో యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యంపై నిన్న‌(మంగ‌ళ‌వారం) ఆందోళ‌న చేప‌ట్టిన విద్యార్థులు .. బుధ‌వారం కూడా త‌మ నిర‌స‌న‌లు కొన‌సాగించారు. వేలాది మంది విద్యార్థులు మెయిన్ గేటు వ‌ద్ద బైఠాయించి ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న తెలుపుతున్నారు. కాగా.. తెలంగాణ రాష్ట ఆవిర్భావం నుంచి ఆర్జీయూకేటీకి శాశ్వ‌త వీసీ నియామ‌కం జ‌ర‌ప‌క‌పోడం, మూడేళ్లుగా ల్యాప్‌టాప్‌ల స‌ర‌ఫ‌రా, ఏక‌రూప దుస్తుల పంపిణీ లేక‌పోవ‌డం, నాణ్య‌మైన భోజ‌నం పెట్ట‌క‌పోవ‌డంపై ఆందోళ‌న చేప‌ట్టిన‌ట్లు విద్యార్థులు తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ లు క‌ళాశాల‌ను సంద‌ర్శించి త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ భ‌రోసా..

ఆర్జీయూకేటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారని తేజాగౌడ్‌ అనే విద్యార్థి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు లేవనెత్తిన అంశాలను సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు.

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఆర్జీయూకేటీలో వీలైనంత తొందరగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేడు సంబంధిత వీసీతో సమావేశమవుతానని తెలిపారు.

Next Story