కరోనా వ్యాక్సిన్ల ధరల్లో తేడాలపై కేటీఆర్ ఆగ్రహం

Minister KTR angry on vaccine prices.తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ధరల్లో ఉన్న తేడాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2021 6:37 AM GMT
KTR angry on vaccine prices

త్వరలో కరోనా వ్యాక్సిన్లను మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్లను కొనుక్కోడానికి అధికారాలను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ వ్యాక్సిన్ల విషయంలో ఉన్న తేడాలపై పలువురు రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ధరల్లో ఉన్న తేడాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్యాక్సిన్‌ను రూ.150కి, రాష్ట్రాలకు రూ.400కు సరఫరా చేస్తామని వ్యాక్సిన్‌ ఉత్ప‌త్తి కంపెనీ (సీరం) ప్రకటించింద‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఒకే దేశం-ఒకే పన్ను (జీఎస్‌టీ)ను రాష్ట్రాలు అంగీకరించాయ‌ని.. ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు ఎందుకని ఆయ‌న ప్రశ్నించారు.

అంతేకాకుండా వ్యాక్సిన్ల‌ కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని ప్ర‌ధాన మంత్రి కేర్స్ నిధుల‌ నుంచి భరించాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. దేశ‌మంతా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగాల‌న్న స్ఫూర్తికి అస‌లు కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తుందా? అని ఆయ‌న ప్రశ్నించారు. స‌బ్ కా సాత్ స‌బ్కో వ్యాక్సిన్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. తెలంగాణ‌లోని మునిసిపాలిటీల్లో ఫంట్ లైన్ వ‌ర్క‌ర్ల‌కు తాము స‌మ‌ర్థంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను కొన‌సాగించామ‌ని కేటీఆర్ తెలిపారు. 141 మునిసిపాలిటీల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ 95.55 శాతం పూర్త‌యింద‌ని, జీహెచ్ఎంసీలో 96.19 శాతం పూర్త‌యింద‌ని ఆయ‌న చెప్పారు. త్వ‌ర‌లోనే 100 శాతం పూర్త‌వుతుంద‌ని తెలిపారు.

వ్యాక్సిన్ల ధరలపై ఈ వ్యత్యాసాలపై పలు రాష్ట్రాల నాయకులు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. భారత్ లో ప్రజలను వ్యాక్సిన్ పేరుతో దోచుకునే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిందని అంటున్నారు.


Next Story
Share it