డిసెంబర్ 4న జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం: కేటీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది.
By Srikanth Gundamalla Published on 27 Nov 2023 9:31 AM ISTడిసెంబర్ 4న జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం: కేటీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. ఇంకో మూడ్రోజుల్లో పోలింగ్ జరగనుంది. మరోవైపు ప్రచారానికి కూడా ఎక్కువ సమయం లేదు. దాంతో.. ఆయా పార్టీల నాయకులు సభలు.. ర్యాలీలతో ప్రజల్లోకి మరింత వెళ్తున్నారు. ఈ కొన్ని గంటలు ప్రచారం పీక్స్‌కు చేరుకోనుంది. ఈ క్రమంలోనే ఉద్యోగాల గురించి మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగులతో సమావేశం అయ్యారు. దాంతో.. తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు. రాహుల్ గాంధీ తన ఉద్యోగం కోసం యువతను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పెద్ద జోక్ అంటూ కొట్టి పారేశారు మంత్రి కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంటుందని తెలిసీ ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం.. ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేయడమే అన్నారు. అది పప్పు క్యాలెండర్ అన్నారు మంత్రి కేటీఆర్.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు కేటీఆర్. 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారనీ.. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో మాత్రం గత పదేళ్లలో ఏటా సగటున 16వేల చొప్పున మొత్తం 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి ఏనాడైనా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసి పరీక్షలు రాశారా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి లేదన్నారు కేటీఆర్. ఆయనకు బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శించార. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో బీజేపీపై కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. ఐటీ దాడులపైనా స్పందించిన కేటీఆర్.. అన్ని పార్టీల నాయకుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారని చెప్పారు. కానీ.. కాంగ్రెస్ నేతలు తమని మాత్రమే టార్గెట్ చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.