నాగార్జున ఫ్యామిలీకి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు..అర్ధరాత్రి ట్వీట్

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది

By -  Knakam Karthik
Published on : 12 Nov 2025 7:37 AM IST

Telangana, Minister Konda Surekha, Akkineni Nagarjunas family

నాగార్జున ఫ్యామిలీకి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు..అర్ధరాత్రి ట్వీట్

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ, అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్థరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే..!

కొంతకాలం క్రితం బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ... అక్కినేని నాగార్జున కుటుంబంపై, ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున తీవ్రంగా స్పందించారు. ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు. మరోవైపు నాగచైతన్య, సమంత సైతం తమ విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని, తమ పేర్లను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

Next Story