కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ప్రమాద తీరుపై అధికారులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ.. డ్రైవర్ల నిర్లక్ష్యం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని, డ్రైవర్లను నియమించుకునే ముందు యాజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి సంఘటలు జరిగినప్పుడు యజమానులు భాద్యత వహించాలని, భాదితులను ఆదుకోవాల్సిన బాధ్యత, భారం వారిపై ఉందని చెప్పారు. తెలంగాణకు చెందిన ఆరుగురు ప్రయాణికులు మరణించగా, 10 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారని , కొందరు హాస్పిటల్ చికిత్స పొందుతున్నారని, ప్రాణాపాయం లేదని తెలిపారు. బైక్ ను ఢీకొన్న వెంటనే బస్సును ఆపి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది కాదన్నారు.