బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న రాజగోపాల్ వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. పోలింగ్ ఏజెన్సీల సర్వే ప్రకారం బీజేపీ మూడో స్థానంలో ఉందని, అందుకే ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలపై బీజేపీ మాట్లాడుతోందని మంత్రి అన్నారు.
బీజేపీ నేతలు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ఒక్క నియోజకవర్గంలోనే ఎన్నికలను ఎదుర్కోలేని వారు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. రైతులు, సైనికులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, దీనిపై అనవసరపు విమర్శలు చేస్తున్నారంటూ.. ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. సరిహద్దులను కాపాడే సైనికుల త్యాగం గొప్పతనాన్ని గుర్తించలేని గొప్ప దేశ భక్తులు.. ప్రతిపక్ష నేతలని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.
ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం: రాజగోపాల్ రెడ్డి
మునుగోడులో టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ నేత రాజగోపాల్ వ్యాఖ్యానించారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారని చెప్పారు. మరో 6 నెలల్లో మునుగోడులో ఎన్నికలు రాబోతున్నాయన్న ఆయన ఈ ఎన్నికలలో తన గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. తన రాజీనామా వృథాగా పోలేదని, ఇందుకు ప్రభుత్వం చేస్తున్న పనులే ఎగ్జాంపుల్ అని గుర్తు చేశారు. నిన్న భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట్ గ్రామం ప్రచారం ప్రారంభించిన అనంతరం రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.