అడవుల పునరుద్ధరణకు పెద్ద ఎత్తున చర్యలు: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

Minister Indrakaran Reddy said that large-scale measures are being taken for the restoration of forests. సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 1984 నుంచి ఇప్పటి వరకు 21 మంది అటవీ అధికారులు

By అంజి  Published on  11 Sep 2022 2:34 PM GMT
అడవుల పునరుద్ధరణకు పెద్ద ఎత్తున చర్యలు: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 1984 నుంచి ఇప్పటి వరకు 21 మంది అటవీ అధికారులు తెలంగాణలో అడవులను కాపాడుతూ ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర పర్యావరణ అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఆయన మాట్లాడుతూ.. నాటి చరిత్రను గుర్తు చేసుకున్నారు. సుమారు 292 ఏళ్ల క్రితం అంటే 1730లో రాజస్థాన్ రాష్ట్రంలోని అడవులను కాపాడేందుకు బిష్ణోయ్ తెగకు చెందిన 360 మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు.

"వారి త్యాగాలను స్మరించుకోవడానికి, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11 న, మేము దేశవ్యాప్తంగా అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటాము." అని అన్నారు. అటవీశాఖ అధికారుల కృషిని అభినందించిన మంత్రి.. సహజవనరులను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని, అడవుల్లో క్రూర మృగాలు, స్మగ్లర్లు ఉన్నా.. అటవీశాఖ అధికారులు, సిబ్బంది నిర్భయంగా పనిచేయడం అభినందనీయమన్నారు.

అటవీ శాఖ పనితీరు

2021-2022లో అటవీ అధికారులు మొత్తం 11,669 కేసులు నమోదు చేసి రూ.14.07 కోట్ల జరిమానా విధించారు. రూ.7.31 కోట్ల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు, 1,634 వాహనాలను జప్తు చేశారు. 1,133 అటవీ భూముల ఆక్రమణ కేసులు ఉన్నాయని ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.

ఖాళీల భర్తీకి సంబంధించి ఈ ఏడాది 92 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 14 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. దీంతోపాటు 2,173 వాహనాలను అటవీశాఖ అధికారులు, సిబ్బందికి అప్పగించారు.

జంగిల్ బచావో–జంగిల్ బడావో

ప్రస్తుతం ఉన్న అడవుల రక్షణతో పాటు క్షీణించిన అడవుల పునరుద్ధరణకు ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. అడవుల పరిరక్షణ, స్మగ్లింగ్‌ కార్యకలాపాలను అరికట్టేందుకు సమగ్ర చర్యలు ప్రారంభించామన్నారు. అదనంగా.. అడవిలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా వన్యప్రాణులకు తాగునీటి సమస్యను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

అటవీ సరిహద్దులు, పెంపుడు జంతువులు, పశువులను నియంత్రించేందుకు 10,732 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వి అడవులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కందకాలపై గోరింటాకు మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.

తెలంగాణ హరిత పథకం

తెలంగాణ హరితహారం పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 268.75 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 14,965 నర్సరీలు ఏర్పాటు చేయగా గ్రామ పంచాయతీల్లో 12,769, మున్సిపాలిటీల్లో 1,002 నర్సరీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు జిల్లా స్థాయిలో క్షీణించిన అడవుల పునర్నిర్మాణం పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.

Next Story