మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీకి ప్ర‌జ‌లు బుద్దిచెబుతారు : మంత్రి హ‌రీశ్ రావు

Minister Harish Rao says voters teaches lesson to BJP in Munugode bypoll.మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారంలో టీఆర్ఎస్ స్పీడ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Oct 2022 7:49 AM GMT
మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీకి ప్ర‌జ‌లు బుద్దిచెబుతారు : మంత్రి హ‌రీశ్ రావు

మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారంలో టీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్ర‌చారంలో పాల్గొంటూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వచ్చిందని అని మండిప‌డుతున్నారు.

బీజేపీకి ప్ర‌జ‌లు బుద్దిచెబుతారు : మంత్రి హ‌రీశ్ రావు

బుధ‌వారం ఉద‌యం మ‌ర్రిగూడెం మండ‌లం రాజుపేట గ్రామంలో మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. డ‌బ్బు, మ‌ద్యంతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధిచెప్తారన్నారు. కోమటిరెడ్డి మళ్లీ గెలిస్తే టీఆర్‌ఎస్‌ను తిట్టడం తప్ప చేసేది ఏమీ ఉండ‌ద‌ని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలన్న గిరిజనుల‌ డిమాండ్‌ను అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లు పట్టించుకోలేదని గుర్తుచేశారు. అయితే.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించాలన్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రూ.3 వేలు పెన్షన్ ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనే రూ.700, బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో రూ.600 పెన్షన్ ఇస్తున్నారన్నారు. మ‌రీ తెలంగాణలో రూ.3 వేలు ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. ముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ.3 వేలు పింఛన్‌ ఇచ్చిచూపించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ మందు సీసాలు, పైసలిచ్చి ఓట్లు కొనాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే శివన్నడూడెం రిజర్వాయర్‌ను పూర్తిచేసి భూమిలోని ఫ్లోరైడ్‌ను తరిమి కొడతామన్నారు.

మునుగోడులో అభివృద్ధి కుంటుప‌డింది : మంత్రి గంగుల‌

గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా మునుగోడులో అభివృద్ధి కుంటుపడింద‌ని మంత్రి గంగుల క‌మలాక‌ర్ అన్నారు. సంస్థాన్ నారాయ‌ణ‌పురంలో నిర్వ‌హించిన ముదిరాజ్ సంఘం ఆత్మీయ స‌మావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

రాజ‌గోపాల్ రెడ్డి స్వార్థంతో మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి గంగుల అన్నారు. గ‌త నాల‌గు సంవ‌త్స‌రాలుగా మునుగోడులో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఒక్కసారి కూడా రాజగోపాల్‌ రెడ్డి గ్రామాలకు వెళ్లలేదని విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించేది వారి సమస్యల పరిష్కారం కోసమేనని, సొంత పనుల చక్కదిద్దుకోవడానికి కాదన్నారు. సొంత కాంట్రాక్టుల కోసం పనిచేస్తానని తానే చెప్పుకుంటున్నాడని, అలాంటి వ్యక్తికి ఎందుకు ఓటెయ్యాలన్నారు.

మునుగోడును పీడిస్తున్న ఫ్లోరోసిస్‌ను మిషన్ భగీరథతో సీఎం కేసీఆర్ దూరం చేశారని, టీఆర్‌ఎస్‌ పాలనలో కల్యాణలక్ష్మీ, రైతుబందు, రైతు బీమా, 24 గంటల ఉచితకరెంటు, గొర్రెల పంపిణీ, ముదిరాజులకు, గంగపుత్రులకు చేపపిల్లల పంపిణీ, పోడుభూములకు హక్కు, గిరిజన రిజర్వేషన్లు, ఉచిత బియ్యం, మద్దతు ధరతో పంటల సేకరణ ఇలా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Next Story