తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర మంత్రుల ద్వంద్వ వైఖరిపై రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్రమంత్రులు ఢిల్లీలో కొనియాడుతున్నారని, రాష్ట్రంలో విమర్శలు చేస్తున్నారని అన్నారు. అవార్డులు ఇస్తూనే మరోవైపు అవినీతి జరిగిందని కేంద్రమంత్రులు ఆరోపించడం విడ్డూరంగా ఉందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పాటించలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను సక్రమంగా విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు.
మిషన్ భగీరథ పథకానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. గత ప్రభుత్వాల హయాంలో బోర్‌వెల్ మరమ్మతులకే సర్పంచ్‌లు పరిమితమయ్యారని గుర్తు చేసిన ఆయన ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో నీరు, విద్యుత్ ఇబ్బందులు లేవని అభిప్రాయపడ్డారు. పాదయాత్ర చేస్తున్న నేతలకు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నాణ్యత, పరిమాణం, క్రమబద్ధతపై దృష్టి సారించిందని, దేశం మొత్తం తెలంగాణ మోడల్ వైపు చూస్తోందని అన్నారు.
మిషన్ భగీరథ పథకం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. దేశంలో 50 శాతం ప్రజలకు ఇప్పటికీ తాగునీరు అందడం లేదని, 100% తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు, 1962 సంచార పశువైద్యశాలలు, ఇతర పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందని హరీశ్ రావు అన్నారు . ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కేంద్రం తన జల్ జీవన్ మిషన్‌కు స్ఫూర్తిగా మిషన్ భగీరథను పేర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు. "ప్రతిరోజూ, ఒక కేంద్ర మంత్రి రాష్ట్రాన్ని సందర్శించి, రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.