టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao inauguration of Mini Diagnostic Hub at Narsingi.బస్తీలోని ప్రజలకు సేవ చేయాలని విప్లవాత్మక
By తోట వంశీ కుమార్ Published on 11 May 2022 8:02 AM GMTబస్తీలోని ప్రజలకు సేవ చేయాలని విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్‌ను, మొబైల్ యాప్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బస్తీ ప్రజల సుస్తీ పోగొట్టేందుకు విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు వివరించారు. హైదరాబాద్‌లో 350 బస్తీ ఆస్పత్రులను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పేద ప్రజలు వైద్య పరీక్షల పేరుతో వేల రూపాయలను పొగొట్టుకుంటున్నారు. అందుకనే వారి కోసం టి డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రస్తుతం టీ డయాగ్నోస్టిక్‌లో 57 రకాలు సేవలు అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులో మరో 134 రకాల సేవలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు బస్తీ దవాఖానాల్లో మందుల కొరత లేదన్నారు. డాక్టర్లు మెడిసిన్స్ బయటకు రాసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్‌లు ఇంటి వద్దకే వచ్చి టెస్టులు చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.
ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా అప్పుడప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30 శాతం మాత్రమే కాన్పులు ఉన్నాయని, ఈ ఏడు సంవత్సరాల కాలంలో 56 శాతం పెరిగాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నామని వివరించారు. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు.
త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.