Telangana: మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. ఇద్దరిపై కేసు

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సంతకం ఫోర్జరీ వ్యవహారం కలకలం రేపింది.

By అంజి  Published on  21 Aug 2023 3:30 AM GMT
Minister Errabelli Dayakar Rao, signatures forgery, Telangana

Telangana: మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. ఇద్దరిపై కేసు

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సంతకం ఫోర్జరీ వ్యవహారం కలకలం రేపింది. ఏకంగా మంత్రి లెటర్ హెడ్‌తో పాటూ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి ఎర్రబెల్లి సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఈ వ్యవహారంపై మంత్రి ఓఎస్‌డీ ఎస్‌ఎం రాజేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి లెటర్‌ హెడ్‌ను, సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకంగా మంత్రి లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ కావడం సంచలనంగా మారింది. డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఎలాగైనా దక్కించుకోవాలని ప్లాన్‌ వేసిన ఇద్దరు వ్యక్తులు ఏకంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సంతకాన్ని ఫోర్జరీ చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం నర్రెగూడెంకు చెందిన మహ్మద్‌ గౌస్‌ పాషా మొబైల్స్‌ బిజినెస్‌ చేస్తున్నాడు. ఇక అదే జిల్లాకు చెందిన గుంటి శేఖర్‌ ప్రైవేట్‌ సెక్టార్‌ జాబ్‌ చేస్తున్నాడు.

ఇద్దరు కలిసి డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఇతర సోషల్‌ వెల్ఫేర్‌ స్కీమ్‌ల ద్వారా లబ్ధి పొందాలనుకున్నారు. ప్లాన్‌ ప్రకారం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరుతో లెటర్‌హెడ్‌ తయారు చేశారు. ఆ తర్వాత మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ స్కీమ్‌ల కోసం అప్లికేషన్‌ పెట్టుకున్నారు. అయితే కొన్ని రోజుల కిందట డబుల్‌ బెడ్రూంలకు సంబంధించి విచారణ చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి మంత్రి పేరుతో వచ్చిన సిఫారసు లెటర్‌లపై అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని మంత్రి ఓఎస్‌డీ దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని పరిశీలించి ఫోర్జరీ సంతకాలుగా గుర్తించిన ఓఎస్‌డీ ఎస్‌ఎం రాజేశ్వరరావు ఫిర్యాదు వెంటనే బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వారి కోసం గాలిస్తున్నారు.

Next Story