సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా అవతరించిన భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ సభకు సర్వం సిద్దమైంది. ఖమ్మంలో నిర్వహించే సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 5 లక్షల మంది సభకు వస్తారు అన్న అంచనాల మధ్య 100 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సభకు వచ్చే కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పేరుతో పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్ద వంగరకు చెందిన అభిమానులు వాటర్ బాటిళ్లను తయారు చేశారు. సభకు వచ్చే కార్యకర్తల దాహాన్ని వీటితో తీర్చనున్నారు. వీటిని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరగనున్న నేటి సభ వైపు దేశ మొత్తం చూస్తోందన్నారు. సీఎం ప్రకటించనున్న ఎజెండా ఈ దేశ భవితవ్యానికి దిక్సూచి కానుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే ఎజెండాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర మొదటి అడుగు కావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు. భారతదేశంలో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చి, రైతు సర్కారును భారత పీఠం మీద ఎక్కించే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిదన్నారు. సభకు హాజరయ్యేందుకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి తరలి వస్తున్న బస్సులకు జెండా ఊపి మంత్రి స్వాగతం పలికారు.