కేటీఆర్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరిక

కేటీఆర్‌పై తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  18 Sep 2024 4:00 PM GMT
కేటీఆర్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరిక

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై.. తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులను నాశనం చేసే కుట్రలను మానుకోవాలంటూ హెచ్చరించారు. గాంధీ ఆస్పత్రిపై కేటీఆర్‌ బురద జల్లి, ఇక్కడికి ట్రీట్‌మెంట్‌ వచ్చే నిరుపేదల స్థైర్యాన్ని దెబ్బతీయడం బాధాకరమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటళ్లు ఏ విధంగా ఎదిగాయో ప్రజలందరికీ తెలుసని మంత్రి దామోదర అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఎలా దెబ్బతీశారో కూడా జనాలు మర్చిపోలేదని అన్నారు. గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ దవాఖాన్లను పది సంవత్సరాల పాటు నాశనం చేశారంటూ బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే తరహా కుట్రలు చేయడం సిగ్గుచేటని మంత్రి దామోదర మండిపడ్డారు. గాంధీ వంటి టెర్షియరీ కేర్ హాస్పిటళ్లకు అత్యంత విషమంగా ఉన్న పేషెంట్లు వస్తారని చెప్పారు. చివరి నిమిషం వరకూ వాళ్ల రోగాన్ని నయం చేసి, ఎలాగైనా వాళ్లను బ్రతికించేందుకు డాక్టర్లు తమ శక్తిమేర ప్రయత్నిస్తారని అన్నారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోతారు. అందుకే దేశంలోని ఏ టెర్షియరీ కేర్ హాస్పిటల్‌లోనైనా, ప్రతి నెలా పదుల సంఖ్యలో మరణాలు జరుగుతుంటాయని అన్నారు.

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మరణాలు జరిగాయంటూ నంబర్లను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నాన్ని బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్నారని మంత్రి దామోదర అన్నారు. ఆయన అజ్ఞానికి, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే ఆయన సహజ గుణానికి ఆయన మాటలు అద్దం పడుతున్నాయన్నారు. గాంధీ ఆస్పత్రిని నాశనం చేసి, పేషెంట్లను రానీయకుండా చేసి కార్పొరేట్ హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చాలని ఆయన కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు. ఇకనైనా ఇలా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేయడం మానుకోకపోతే, ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

Next Story