అలా చేస్తే చర్యలు తప్పవు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు మంత్రి దామోదర వార్నింగ్
అదనపు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టినా, అడ్వాన్స్‌గా ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేసినా ఉపేక్షించేది లేదని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.
By Knakam Karthik
అలా చేస్తే చర్యలు తప్పవు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు మంత్రి దామోదర వార్నింగ్
అదనపు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టినా, అడ్వాన్స్‌గా ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేసినా ఉపేక్షించేది లేదని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ప్రయివేట్ మెడికల్ కాలేజీల మేనేజ్‌మెంట్స్ డీన్స్, ప్రిన్సిపల్స్‌తో సచివాలయం వేదికగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సమీక్షా సమావేశం నిర్వహించారు. మెడికల్ ఎడ్యుకేషన్ నాణ్యత ప్రమాణాలు, ఎన్‌ఎంసీ నిబంధనలు, ఫాకల్టీ, అటెండెన్స్, ఫీజులు, తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ డాక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ప్రపంచంలోని ఎన్నో ప్రఖ్యాత మెడికల్ ఇనిస్టిట్యూట్స్‌ను ఇక్కడ చదువుకున్న డాక్టర్లు లీడ్ చేస్తున్నారు. ఇక్కడి వైద్య విద్య ప్రమాణాల వల్లే అది సాధ్యమైంది. ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో ఘోస్ట్ ఫాకల్టీని పెట్టి నడిపిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పద్ధతి మంచిది కాదు. ఇలాంటి చర్యలు వల్ల వైద్య విద్య ప్రమాణాలు దిగజారుతాయి. వైద్య విద్యలో నాణ్యత ప్రమాణాలు తగ్గితే ప్రజల ప్రాణాలకే ముప్పు.. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
మెడికల్ స్టూడెంట్స్‌కు స్టైఫండ్స్ చెల్లించే విషయంలో కొన్ని కాలేజీలపై వరసగా ఫిర్యాదులు వస్తున్నాయని.. పిల్లలకు ఇచ్చే స్టైఫండ్ విషయంలో రాజీ పడొద్దని సూచించారు. అది వాళ్ల చదువులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెప్పారు. పిల్లలకు కచ్చితంగా స్టైఫండ్ చెల్లించాలని ఆదేశించారు. కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్‌లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అదనపు ఫీజుల కోసం స్టూడెంట్స్‌ను ఇబ్బంది పెట్టినా, అడ్వాన్స్‌గా ఫీజులు కట్టాలని ఒత్తిడి చేసినా ఉపేక్షించేది లేదని అన్నారు. ఎన్‌ఎంసీ నిబంధనల విషయంలో కాలేజీలు లేవనెత్తిన సమస్యలను, ఎన్‌ఎంసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.