బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ నిర‌స‌న తెలుపుతున్న‌ అభ్యర్థులకు సంఘీభావం తెలిపేందుకు వ‌చ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

By Medi Samrat  Published on  19 Oct 2024 5:15 PM IST
బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ నిర‌స‌న తెలుపుతున్న‌ అభ్యర్థులకు సంఘీభావం తెలిపేందుకు వ‌చ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్‌-1 అభ్యర్థులతో ర్యాలీగా సెక్రటేరియట్‌కు వెళ్తున్న క్ర‌మంలో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ నగర్‌లో ఆశావహులను కలిసిన తర్వాత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ 'చలో సెక్రటేరియట్' ర్యాలీని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశావహులతో నినాదాలు చేస్తూ సంజయ్ కుమార్ ముందుకు క‌దిలారు.

అంత‌కుముందు అభ్యర్థులు తమ బాధలను కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు చెప్పుకున్నారు. అనంత‌రం పెద్ద సంఖ్యలో యువకులతో కలిసి ఆయన 'చలో సెక్రటేరియట్' ర్యాలీ చేపట్టి ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను తెలుపుదామ‌ని బ‌య‌లుదేరారు. అయితే బండి సంజయ్‌ కుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం సచివాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఆయ‌న‌ వాహనంపై నిలబడి అభ్యర్థులను ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడారు. ఆ త‌ర్వాత సంజయ్ కుమార్‌ను పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు.

పరీక్ష నిర్వహణకు హైకోర్టు ఇప్పటికే ఆమోదం తెలిపిందని.. అభ్యర్థులు తమ ఫిర్యాదులను ప్రజాస్వామ్యయుతంగా తెలియజేయవచ్చని.. అయితే ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని రాష్ట్ర డీజీపీ జితేందర్ కోరారు.

Next Story